తెలుగు సినిమాల్లో మల్టీసారర్ సినిమాలు దాదాపు హిట్లే. ప్రేక్షకులకు వినోదాన్ని, నిర్మాతలకు కాసుల వర్షాన్ని, హీరోల ఇమేజ్ ను అమాంతం పెంచేసిన మల్టీస్టారర్ మూవీలు చాలానే ఉన్నాయి. అయితే.. రాజకీయాల్లో ఈ ఫార్ములా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇద్దరు నేతలు ఒక పార్టీలో కలుపుగోలుగా ముందుకు సాగడం అంటే దాదాపు కష్టమే. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో చూశాం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ స్థాయిలో అటు ప్రజల్లో, ఇటు పార్టీలో మంచి ఫాలోయింగ్ సాధించారు ఈటల. కరోనా సమయంలో అయితే కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు రాగా.. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ రాజేందర్ జనం మధ్యనే ఉండడం బాగా హైలైట్ అయింది. అంతే.. ఆ తర్వాత రాజేందర్ కు పొగ పెట్టడం మొదలైంది. కానీ, ఆయన తన పంథా మార్చుకోలేదు. దీంతో ఈటలతో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి కేసీఆర్ కావాలనే ఆయన్ను బయటకు పంపారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈటల బీజేపీలో ఉన్నారు. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈమధ్య బీజేపీలో జరిగిన మార్పులతో పార్టీలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్నా.. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమంతో అంతా క్లియర్ అయిపోయింది. పార్టీ నేతలందరూ కలిసి కట్టుకట్టుగా ముందుకెళ్దామని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా, ఉదయం నుంచి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అయిపోయేవరకు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కలిసిమెలిసి కనిపించడం, చివరిలో ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవడం పార్టీ శ్రేణుల్లోకి ఓ మంచి మెసేజ్ వెళ్లింది. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడే అయినా.. ఎన్నికల నిర్వహణ అంతా ఈటల చేతుల్లో ఉంటుంది. వీరిద్దరూ కలిసి ముందుకు సాగితే విజయం తథ్యమని.. ఈ మల్టీస్టారర్ పక్కా సూపర్ హిట్ అని అనుకుంటున్నారు.
ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో ఈటల దిట్ట. హుజూరాబాద్ ఉప ఎన్నికే దీనికి సాక్ష్యం. అధికార బీఆర్ఎస్ కు చెందిన లీడర్లందరూ ముకుమ్మడిగా తనపై యుద్ధానికి వచ్చినా చెక్కుచెదరని ధైర్యంతో, అడుగు తడబడకుండా ప్రజలతో కలిసి తగిన బుద్ధి చెప్పారు. హుజూరాబాద్ లో కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ వచ్చేలా చేశారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ బీజేపీకి మరింత బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అంతా కాషాయ జెండా ఎగురవేయాలని అధిష్టానం పార్టీలో కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఈటలను ఓ అస్త్రంగా మలుచుకుని కేసీఆర్ సర్కార్ ను గద్దె దించాలని చూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజేందర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పార్టీని గెలుపు దిశగా పయనించేలా చేస్తుందని గట్టిగా నమ్ముతోంది.