బాలీవుడ్ (Bollywood) టెలివిజన్ నటుడు (Television Actor) రితురాజ్ సింగ్ (Rituraj Singh) రాత్రి గుండెపోటు (Heart Attack)తో మరణించారు. 59 ఏళ్ల అతను గత కొంతకాలంగా.. ప్యాంక్రియాటిక్ సమస్యలతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అతని సన్నిహితుడు నటుడు అమిత్ బెహ్ల్ ధృవీకరించారు.
అయితే గత కొంతకాలంగా రీతురాజ్ ప్యాంక్రియాటిక్ (కాలేయ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతూ ఇటీవల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రితురాజ్ సింగ్ తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. మరోవైపు ఈ నటుడు బాలీవుడ్‌లో అనేక సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, ఆహత్, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్ వంటి అనేక వాటిలో నటించారు.
మరోవైపు గతేడాది వచ్చిన అజిత్, తెగింపు చిత్రంలో కూడా నటించాడు. ఇలా దాదాపు 50 టీవీ సీరియళ్లలో నటించారు. అలాగే 11 సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కాగా గుండెపోటుతో ఆకస్మికంగా ఆయన మృతి చెందడంతో బాలీవుడ్ సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకొన్నాయి. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
అయితే నిన్న అస్వస్థతకు గురికావడంతో మరోసారి ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లేలోపే గుండెపోటుతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారని అతని సన్నిహితులు తెలిపారు. సుమారుగా అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు.