ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని కాన్పూర్ జిల్లా(Kanpur District)లోని రామ్ జానకి ఆలయానికి(Ram Janaki Temple) బాంబు బెదిరింపు(Bomb Threat) కలకలం రేపింది. ఆ ఆలయం గోడలపై పోస్టర్లు వెలియడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అంతేకాదు.. అక్కడి బీజేపీ లీడర్ రోహిత్ సాహునూ చంపేస్తామని హెచ్చరించారు. రామ్ జానకి టెంపుల్ ట్రస్టీగా రోహిత్ కొనసాగుతున్నారు. అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన ఆరు రోజుల తర్వాత రామ్ జానకి టెంపుల్‌ను పేల్చేస్తామని బెదిరింపు ప్రకటన చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రోహిత్ సాహు సోదరుడు రాహుల్ సాహు మాట్లాడుతూ.. ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని వాల్ పోస్టర్లు అతికించినట్లు ఈ ఉదయం తనకు సమాచారం అందిందన్నారు. తాను అక్కడికి వెళ్లి చూడగా ఆలయంలో బెదిరింపు పోస్టర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు.
భయమేసి ముందస్తు జాగ్రత్తగా ఆలయం తలుపులు మూసి, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు రాహుల్ సాహు తెలిపారు. ఈ బాంబు బెదిరింపు పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భక్తులు అటు వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.