హైదరాబాద్ (Hyderabad), జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో ఉన్న టానిక్ ఎలైట్ వైన్ షాపు (Tonic Elite Wine Shop)లో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు అధికారులు సోదాల్లో గుర్తించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. అయితే.. ఈ లైసెన్స్ కింద.. ఏకంగా 11 మద్యం దుకాణాలు నడిపించారని గుర్తించారు.
ఈ షాపులకు బీఆర్ఎస్ (BRS) నేతలే ఓనర్స్.. ప్రభుత్వం మనదే. ఏం చేసినా నడుస్తుందనే తీరులో కేసీఆర్ (KCR) ప్రభుత్వం వ్యవహరించిందనడానికి టానిక్ లిక్కర్ మాల్స్ మరో ఉదాహరణ అని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల అండతో.. స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ..ఈ గ్రూప్ రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇన్నాళ్ళూ చిలక పలుకులు పలికిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రస్తుతం టానిక్ స్కాం కుదిపేస్తోంది.
ఎందుకంటే ఈ స్కామ్ లో స్వయంగా ఎం.పి. సంతోష్ రావు పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎక్సైజ్ అదికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి కుంభకోణాల్లో ఇది కూడా కీలకంగా మారింది. అదీగాక ముగ్గురు రాష్ట్ర ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సీఎంవో అధికారిగా పనిచేసిన భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి రవీందర్ రావు కూతురు హారిక, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి కి టానిక్ గ్రూప్ లో వాటాలు ఉన్నాయని సమాచారం..
మరోవైపు దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కాం వివాదం కొనసాగుతూ ఉండగానే.. ఇప్పుడు తెలంగాణలో మరో కొత్త లిక్కర్ స్కాం వెలుగులోకి రావడం.. సంచలనంగా మారింది. ఉద్యమంలో తెలంగాణ బిడ్డల ఊసురు పోసుకొని లక్షల కొట్లు తెలంగాణ సొమ్ము దోచుకొన్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఇన్నాళ్ళూ ఆధారాలు లేవని కప్పిపుచ్చిన బీఆర్ఎస్ ముఖ్యనేతల భాగోతాలు.. సీఎం రేవంత్ (Revanth Reddy) వెలుగులోకి తేవడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా తెలంగాణ (Telangana)లో ఏ వైన్ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్‌కు మద్యం దుకాణానికి మాత్రమే ఉండటం గమనార్హం. టానిక్ వైన్ షాప్‌కి రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా మద్యం తీసుకునే వెసులుబాటుతో పాటు దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెచ్చుకొని విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చారు. మొత్తంగా ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా గత ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారని అధికారులు అంటున్నారు.
అయితే ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా.. ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… బీఆర్ ఎస్ ఓడిపోవడంతో వెంటనే బీఆర్ఎస్ నేతలు తమ వాటాలు వేరే వ్యక్తులకు అమ్ముకొన్నారని తెలుస్తోంది. అదీగాక జీఎస్టీ, వ్యాట్ ఎగవేత కోణాలతో పాటు మద్యం బదిలీ, పన్ను చెల్లించని మద్యం అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు ఈ దుకాణాల్లో ఆహార పదార్థాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా వాటిని విక్రయిస్తూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు తేలింది. సామాన్య ప్రజలను పీడించి పన్నుల రూపంలో వసూలు చేసిన గత ప్రభుత్వం అవినీతిపై ఉన్నత అధికారుల మౌనం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది.