బీఆర్ఎస్ (BRS) నేత తాటికొండ రాజయ్య (Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని చెప్పారు. ఒక వేళ టికెట్ రాకపోతే బరిలో నిలిచేది లేనిది కాలమే నిర్ణయిస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ (Minister Ktr) తో తనకు జరిగిన సంభాషణను వక్రీకరించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వడ్డిచర్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కార్యకర్తలు ఆందోళనలు చెంద కూడదని సీఎం కేసీఆర్ 115 టికెట్లు కేటాయించారని అన్నారు. నివేదికలు, సర్వే రిపోర్టులకు అనుగుణంగా తర్వాత మార్పులు చేర్పులు వుంటాయని సీఎం చెప్పారని ఆయన వెల్లడించారు.
ఇప్పటి వరకు టికెట్లు కేటాయించిన నియోజక వర్గాల్లో ఎక్కడా కూడా బీఫామ్ ఇవ్వలేదన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాలకు వెళ్లే సమయంలో ఆయన్ని కలిశానన్నారు. తన పనితీరు పట్ల కేటీఆర్ సంతృప్తిగా వున్నారని చెప్పారు. తనకే టికెట్ కేటాయిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు.
టికెట్లు ప్రకటించే సమయంలో కేటీఆర్ లేకపోవడంతో తాజాగా రెండు రోజుల క్రితం ఆయన్ని కలిశానన్నారు. ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా గానీ తనకు అవకాశం ఉందన్నారు. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేషన్ పదవి తీసుకోవాలని చెప్పారన్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్సీలతో కలిసి ఫోటోలు దిగానన్నారు. ఆ ఫోటోపై ఊహా గానాలు రావడంతో మీడియాలో కథనాలు వచ్చాయన్నారు.
కథనాల నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన చెందారన్నారు. పదిహేను రోజుల క్రితం వరంగల్లో ఓ సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొనడంతో పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయన్నారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా తాను అధిస్టానం నిర్ణయం మేరకు కలిసి పని చేశామన్నారు. అధిస్టానం నిర్ణయానికి కట్టుబడి వున్నామన్నారు.