– త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో
– కాంగ్రెస్ గ్యారెంటీలను మించేలా ఉండబోతోందా?
– బీజేపీకి షాకిచ్చేలా ఉంటుందా?
– అన్ని వర్గాలూ సంతోషపడేలా..
– ప్లాన్ చేశామంటున్న గులాబీ నేతలు
– గత హామీలకే దిక్కులేదంటున్న ప్రతిపక్షాలు
– నిరుద్యో భృతి ఏమైందని ప్రశ్న
– ఇంకా ఇతర పథకాలపై నిలదీత
సీఎం కేసీఆర్ (CM KCR) త్వరలోనే బీఆర్ఎస్ (BRS) మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త ఉంటుందని మంత్రి హరీష్ రావు (Harish Rao) తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందనే చర్చ జోరందుకుంది. బీజేపీ (BJP) హామీలు ఇంకా బయటకు రాలేదు. కాంగ్రెస్ (Congress) ఆరు గ్యారెంటీలు అంటూ హడావుడి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోని కేసీఆర్ ఎలా రూపొందిస్తున్నారో అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, బీజేపీకి షాకిచ్చేలా హామీల్లో ‘అంతకుమించి’ అనేలా వరాలు ఉండబోతున్నాయనేది విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తోంది.
కేసీఆర్ కు ఈసారి ఎన్నికలు ఎంతో కీలకం. రెండు పర్యాయాల పాలనను చూసిన ప్రజలు.. వరుసగా మూడోసారి ఛాన్స్ ఇస్తారా? లేక, షాకిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం ఈసారి బీఆర్ఎస్ ఓటమి పక్కా అని ధీమాగా చెబుతున్నాయి. గెలిచేది తామేనని కాంగ్రెస్, బీజేపీ గట్టిగా వాదిస్తున్నాయి. ఈ తరుణంలో గెలుపు పక్కా కావాలంటే.. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోను కేసీఆర్ రూపొందిస్తున్నట్టుగా చెబుతున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా కర్ణాటక స్ట్రాటజీని అమలు చేస్తున్న కాంగ్రెస్ గ్యారెంటీలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఆ సమయంలో ప్రకటించిన వరాల నేపథ్యంలో పింఛన్ దారులు, రైతులు ఆయన్ను గెలుపుబాట పట్టించారు. ఈసారి కూడా వీరిపైనే ఆశలు పెట్టుకున్న కేసీఆర్.. ఆసరా పెన్షన్లు, రైతు బంధు ఆర్థిక సాయం పెంపు తదితర అంశాలపై దృష్టి సారించారని చెబుతున్నారు. అలాగే, ఉద్యోగుల డీఏ పెంపు, వారికి సంబంధించిన ఇతర ప్రధానాంశాలు ఎన్నికల ప్రణాళికలో పెడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన కేసీఆర్.. వారికి సంబంధించిన ఓట్లను సేఫ్ సైడ్ గా పెట్టుకున్నట్టు ఉదహరిస్తున్నారు. ఇక, దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు పథకాలు లబ్ధి చేకూరుస్తాయని భావిస్తున్న సీఎం.. వాటి తరహాలోనే మహిళా బంధు పథకానికి శ్రీకారం చుట్టే ప్లాన్ లో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
తెలంగాణ కేబినెట్ శుక్రవారం సమావేశం అవుతోంది. ఈ క్రమంలోనే కొత్త పథకాలను ఆమోదించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే.. కేసీఆర్ ను ఈసారి నమ్మి మోసపోవడానికి జనం సిద్ధంగా లేరని అంటున్నాయి విపక్షాలు. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు కేసీఆర్. కానీ, ఇది ఇంతరకూ అమలు చేయలేదు. అయితే.. ఈసారి నిరుద్యోగుల కోసం కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ను కూడా పూర్తి చేయలేదని.. ఇంకోసారి కేసీఆర్ ట్రాప్ లో పడి నిరుద్యోగులు మోసపోవద్దని అవగాహన కల్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. మొత్తంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొనగా.. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దని ప్రతిపక్షాలు ప్రజలకు సూచిస్తున్నాయి.