ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండడంతో నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) కు వలసలు ఎక్కువవుతున్నాయి. మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణా యాదవ్ బీజేపీ గూటికి చేరగా.. తాజాగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayana Reddy) హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు పంపించారు కసిరెడ్డి. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రత్యేకం భేటీ అయ్యారు. టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుండి పోటీ చేయాలని కసిరెడ్డి నారాయణరెడ్డి భావించారు. కానీ, కేసీఆర్ అందుకు సుముఖత చూపలేదు.
ఈమధ్య ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే టికెట్ కేటాయించారు గులాబీ బాస్. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి.. తీవ్ర అసంతృప్తికి గురై బీఆర్ఎస్ పార్టీని వీడారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చాలాకాలంగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో విభేదాలు ఉన్నాయి. 2018లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, జైపాల్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డికి బీఎర్ఎస్ అవకాశం ఇచ్చింది.