బీఆర్ఎస్ (BRS) ఎంపీటీసీ (MPTC) వాసాల నిరోష-రామస్వామి సంచలన ఆరోపణలు చేశారు. తనను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) బెదిరించారని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ నిరోష రామస్వామి ఆరోపించారు. పార్టీ మారవద్దంటూ తనను బెదిరింపులకు గురి చేశాడన్నారు. పార్టీ మారితే గంజాయి ప్యాకెట్లు పెట్టి కేసులు పెట్టిస్తానంటూ తనను బెదిరించాడని ఆయన ఆరోపించారు.
రెండు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పని చేశామని చెప్పారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశానన్నారు. కానీ 2019లో తన భార్యకు ఎంపీటీసీ ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన భార్య భారీ మెజారిటీతో గెలుపొందిందన్నారు. ఈటల బీఆర్ఎస్ ను వీడిన తర్వాత ఉప ఎన్నిక అనివార్య మైందన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. దీంతో సీఎం సూచనల మేరకు తన శక్తివంచన లేకుండా గెల్లు గెలుపు కోసం కృషి చేశానన్నారు. ఎన్నికల సందర్భంలో ఈటల రాజేందర్ అనుచరులు నలుగురిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు.
కౌశిక్ రెడ్డి ఒక కుల ఆహాంకారి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశామన్నారు. కానీ తమ ఫిర్యాదును మాజీ ఎంపీ పట్టించుకోలేదని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తన రాజీనామాను మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావుకు పంపించినట్టు చెప్పారు.