తెలంగాణలో (Telangana) జంపింగ్ సీజన్ మొదలైంది. టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చే సరికి ఇది మరింత పెరిగింది. చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి..రాదని తెలిసిన వెంటనే నేతలు కండువా మార్చేస్తున్నారు.. టికెట్ కోసం గోడ దూకేందుకు సై అంటున్నారు. ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తామంటూనే తెల్లారే సరికే పార్టీ మారుతున్నారు ఇంకొందరు నేతలు.
అయితే తాజాగా బీఆర్‌ఎస్ (BRS) నుండి మరి కొన్ని వికెట్లు పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, (Malipeddi Sudhir Reddy )ఆయన కుమారుడు మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి (Malipeddi Saratchandra Reddy) బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారని సమాచారం. ఈ నేపధ్యంలో సుధీర్ రెడ్డిని కలిసేందుకు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లుతున్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తాగల నేతలవైపు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిన క్రమంలో.. రేవంత్ రెడ్డి సమీప బంధువు అయిన సుధీర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు నాయకులు జోరుగా లాబీయింగ్ చేశారని సమాచారం.
కాగా తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపధ్యంలో హస్తం ఎవరిని నొప్పించకుండా తీసుకొనే నిర్ణయం ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాలలో ఆసక్తి మొదలైంది..