లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు బీఆర్ఎస్ (BRS) శంఖారావాన్ని పూరించింది. ఈ నెల 12న కరీంనగర్ (Karimnagar), ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నేడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం పెద్దపల్లి (Peddapally) నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.
మరోవైపు ఎంపీ అభ్యర్థులపై గులాబీ బాస్ ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. బోయినపల్లి సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి బరిలో నిలవనుండగా.. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
అదేవిధంగా యువతకు పెద్ద పీట వేయాలని భావిస్తున్న గులాబీ బాస్.. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, వరంగల్ (Warangal) నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి లేదా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని వీరేశంను బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది..
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం ఆయన పేరుని ఖరారు చేసినప్పటికీ ఆయన సుముఖంగా లేరని అంటున్నారు. దీంతో చేవెళ్ల టికెట్‌పై బీఆర్ఎస్ లో అనిశ్చితి కొనసాగుతోంది. ఇక మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇలా మొత్తానికి గులాబీ మళ్ళీ వికసించాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి అనుకొంటున్నారు..