జనగామ (Jangaon) జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పోటా పోటీ నిరసనలకు దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ (Errabelli Dayakar) ను దూషించారని కాంగ్రెస్, సీపీఐ శ్రేణులపై కొద్ది రోజుల క్రితం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాలకుర్తి రాజీవ్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ ధర్నాకు దిగింది. స్థానిక నేత ఝాన్సీ రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నిరసన విషయం తెలిసి.. మంత్రిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలను నిరసిస్తూ కౌంటర్ గా ధర్నాకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే.. పోలీసులు (Police) కాంగ్రెస్ నేతల నిరసనను విరమించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఆ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అఖిలపక్ష నేతలు కూడా వచ్చారు. ర్యాలీగా నేతలు రాజీవ్ చౌరస్తా వద్దకు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులను తోసుకుంటూ ర్యాలీగా ముందుకు సాగారు. పాలకుర్తి చౌరాస్తా వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి ఝాన్సీ రెడ్డి, వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈనెల 21న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాలకుర్తి మండల కేంద్రంలోని అంగడిలో రేకుల షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి చెందిన లీడర్ మామిండ్ల రమేశ్ రాజా.. ‘దొరా ఇంతకాలం ఏం చేశారు. ఇన్ని రోజులకు అంగడి గుర్తుకు వచ్చిందా? గతంలో.. ప్రస్తుతం పాలకుర్తి ఏం అభివృద్ధి చెందింది. చర్చకు సిద్ధమా?’ అంటూ నిలదీస్తూ పోస్టు పెట్టాడు. అలాగే, మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి కొండా శ్రీను కూడా మంత్రిని విమర్శిస్తూ రెండు పోస్టులు పెట్టాడు. వీటిపై బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసులు పెట్టారు.