అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పులిలా ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం పిల్లిలా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కారు దిగుతున్న నేతలు.. పక్క పార్టీల్లోకి వలసలు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని పెద్ద బాస్ పార్టీపై దృష్టి మరలించినట్లు జోరుగా ప్రచారం సైతం మొదలైంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎడారిలో నీటి చుక్కలా మారుతుందా అనే అనుమానాలు పుడుతున్నాయి..
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఖమ్మం (Khammam) జిల్లాలో బీఆర్ఎస్ (BRS) తుడిచి పెట్టుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు నిరాకరించడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కాంగ్రెస్ (Congress) గూటిలో చేరారు.. వారితో పాటే క్యాడర్ సైతం వెళ్లిపోయింది.
అయితే ఈ సమయంలో కేసీఆర్ వారిపై సెటైర్లు వేశారు. వారు పార్టీలోకి రాక ముందు ఒక్క సీటే ఉంది.. వారు వచ్చినా ఒక్క సీటే అని వారి అవసరం లేదనుకున్నారు. దానికి తగ్గట్లుగా ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో పాలునీళ్లలా కలసిపోతున్నారు అని ఎద్దేవా చేశారు.. అప్పుడైతే పార్టీ బలంగా ఉందనే ఆవేశంలో అన్నారు.. కానీ దాని పర్యావసనం ఎన్నికల ఫలితాల్లో తేలింది. ప్రతీ చోటా యాభై వేలకుపైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది..
మరోవైపు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోరాడింది పువ్వాడ అజయ్. ఎంపీ నామా మాత్రమే.. వీరిద్దరూ లేకుంటే బీఆర్ఎస్ జిల్లాలో జీరో… కానీ ఇప్పుడు వారు కూడా బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఎంపీ నామా ముందు కాంగ్రెస్ ను సంప్రదించగా.. వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలను సంప్రదించే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఖమ్మంలో బీజేపీ బలోపేతం కావాలంటే వీరి చేరిక తప్పని సరి అని అంటున్నారు..