ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు అంతగా కలిసి వస్తలేనట్టు ఉంది. నేతలకు ప్రమాదాలు, వారి పై దాడులు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి జరగడం కనిపిస్తుంది. ప్రస్తుతం బీఎస్పీ (BSP) తెలంగాణ (Telangana) అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)కి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారుని వెనక నుంచి లారీ ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ తో పాటు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) పాలనపై తీవ్ర వ్యతిరేకతను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నాశనం అయ్యిందన్న ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) కూటమి కుట్రల నుంచి తెలంగాణను కాపాడతానని శపథం చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే వాహనం నుంచి తాను రూ. 25 వేలు దొంగిలించానని కోనప్ప డ్రైవర్ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని అన్నారు. 26 ఏళ్లు ఎటువంటి మచ్చలేకుండా సేవ చేసిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రూ. 25 వేలు దొంగతనం చేస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు. ఇలాంటి తప్పుడు కేసులు తనను భయపెట్టలేవని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు..