సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) అన్నారు. అందుకే గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) ను తీసుకొచ్చారని చెప్పారు. సీపీఎస్ ను రివ్యూ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండు చేస్తున్నారని, పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించిన తర్వాత జీపీఎస్ ను అనే హైబ్రీడ్ మోడల్ కేబినెట్ అమోదించిందన్నారు.
ప్రతిపక్షాలు జీపీఎస్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని బుగ్గన అన్నారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం విషయంలో మంత్రులు, అధికారుల కమిటీ చాలా అంశాలను పరిశీలించి…చివరకు ఉద్యోగులకు ఎక్కువ ఉపయోగకరంగా ఉండే జీపీఎస్ ను రూపొందించిదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వంలో ముఖ్యమైన భాగమని, ప్రభుత్వాన్ని కాపాడుకోవటంలో ఉద్యోగులు కీలకంగా నిలవాలన్నారు.
గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ను చట్టంగా రూపొందించేందుకు శాసనసభలో ప్రవేశపెట్టామని చెప్పిన బుగ్గన, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 11వ పీఆర్సీని అమలు చేసామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచమని గుర్తు చేశారు.
సీఎం జగన్ మాట ఇచ్చిన ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలిపారు. 2014 జూన్ రెండు కంటే ముందు అపాయింట్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆరోపణలు లేకుండా మెరిట్ ప్రకారం భర్తీ చేస్తున్నమన్నారు.