పలు రాష్ట్రాల్లో నామినేషన్ల (Nominations) పర్వం నడుస్తోంది. నామినేషన్లు అంటే అభ్యర్థుల (Candidates) హడావుడి మామూలుగా ఉండదు. పదుల సంఖ్యలో కార్లు, వందలాది మందితో ర్యాలీ, చుట్టూ పది మంది డ్యాన్సులు, బాణా సంచా మోతలు అబ్బో చెప్పాలంటే మాటలు సరిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థి ఎంత సౌండ్ పార్టీనో ఇక్కడే అర్థమవుతుంది. అందుకే నామినేషన్ కార్యక్రమానికి అభ్యర్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
మధ్యప్రదేశ్ కు చెందిన స్వంతంత్ర అభ్యర్థి ప్రియాంక్ సింగ్ ఠాకూర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. బుర్హాన్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో నామినేషన్ వేసేందుకు ఖరీదైన కార్లలో కాకుండా గాడిదపై ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొంత మంది సెలెక్టెడ్ కుటుంబ సభ్యులు ఓటర్లను ఫూల్స్ చేస్తుననారని ఆయన మండిపడ్డారు. పార్టీల రాజకీయ విధానానికి నిరసగా తాను ఇలా గాడిదపై వచ్చానని చెప్పారు. ఇది ఇలా వుంటే ఆయన నామినేషన్ వేసిన విధానం వినూత్నంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.
బుర్హాన్ పురా నియోజక వర్గంలో కాంగ్రెస్ తరఫున సురేంద్ర సింగ్ షేరా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి అర్చనా చిట్నీస్ బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో నవంబంర్ 17న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను నిర్వహించనున్నారు.