ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా(Covid-19) మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటున్న తరుణంలో కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. కరోనా స్వరూపాలను మార్చుకుంటూ కొత్త వేరియంట్లను సృష్టిస్తూ సవాల్ చేస్తూనే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా(USA)లో ఇప్పుడు అత్యంత ప్రమాదకర ‘క్యాండిడా ఆరిస్'(Candida Auris) అనే ఫంగల్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వాషింగ్టన్(Washington)లో చాలామంది ఈ వైరస్‌బారిన పడ్డారని వార్తలు వెలువడ్డాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సమాచారం ప్రకారం, అమెరికాలో ‘క్యాండిడా ఆరిస్’ తొలి కేసు ఈ ఏడాది జనవరి 10న నమోదైంది. ఈ వైరస్‌ను మొదటిసారి 15 సంవత్సరాల కిందట జపాన్‌లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
క్యాండిడా ఆరిస్ బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వైరస్ సొకిందని తెలిపే ప్రత్యేక లక్షణాలేవీ బయటకు కనపడటం లేదు. కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, శక్తివంతమైన యాంటీఫంగల్ ఔషధాల్ని సైతం వైరస్ తట్టుకుంటున్నదని వైద్యులు చెబుతున్నారు.