పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benarjee) కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం చెడ్డదని, ప్రజాస్వామ్యం ప్రమాదకరమైనదని ఎవరైనా అంటే తాను ఒప్పుకోబోనని చెప్పారు. దేశంలో సమాఖ్యవాదం పూర్తిగా ధ్వంసం చేయబడిందని ఆమె పేర్కొన్నారు.
జీఎస్టీలో పలు రాష్ట్రాలు తమ వాటాలను పొందలేక పోతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఎవరైనా అంటే ఆ వాదన సరైంది కాదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అనేది వారి భావజాలం లేదా ఇతరుల దార్శనికతను ప్రసన్నం చేసుకునేందుకు చేసే ప్రయత్నమే అని వివరించారు.
రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యం, సమాఖ్య వాదం, లౌకిక వాదం పట్ల అత్యంత శ్రద్ధ వహించి ఎంతో అంకిత భావంతో మన రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. దేశంలో భిన్నత్వం, సంస్కృతి, భాష, మతం మధ్య ఏకత్వాన్ని తీసుకు వచ్చేందుకు రాజ్యాంగం ఎంతో కృషి చేసిందన్నారు.
ప్రాథమిక హక్కులు, దేశ సార్వభౌమాధికారం మధ్య చక్కటి సమతుల్యత ఉందని పేర్కొన్నారు. ఆ సమతుల్యత దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోతోందన్నారు. గట్టిగా వాదిస్తే వారి ఇంటికి ఈడీ వెళ్తుందని ఆరోపించారు.