Priyanka : మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ (Congress) నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చేసిన ఆరోపణ దుమారం రేపింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల్లో 50 శాతం కమీషన్ కోరుతున్నారని కాంట్రాక్టర్ల సంఘమొకటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిందని ఆమె ట్వీట్ చేశారు. 50 శాతం కమీషన్ ఇచ్చిన తరువాతే తమ బిల్లులు క్లియర్ అయ్యాయని వారు పేర్కొన్నారని ఆమె వివరించారు. ఈ పోకడ ఇలాగే సాగితే కర్ణాటకలో మాదిరే మధ్యప్రదేశ్ లో కూడా ప్రజలు బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు.
నాడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ హయాంలో 40 శాతం కమీషన్ వసూలు చేసేవారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని బీజేపీ నేతలు కొట్టిపారేశారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సరంగ్, మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపైన, కాంగ్రెస్ నాయకులపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాము ప్రియాంకతో బాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ సహా కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్ పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని ఇండోర్ పోలీసులు తెలిపారు.
జ్ఞానేంద్ర అవస్థి అనే వ్యక్తి పేరిట ఓ ఫేక్ లేఖను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని స్థానిక బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ నీమేష్ పాఠక్ కూడా ఫిర్యాదు చేశారని ఇండోర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 50 శాతం కమీషన్ చెల్లించాలని కొందరు కాంట్రాక్టర్లను కోరుతున్నారని ఈ లేఖలో పేర్కొన్నట్టు పాఠక్ వివరించారన్నారు.
అవస్థి, ప్రియాంక గాంధీ, అరుణ్ యాదవ్ పైన కేసు దాఖలైందని.. ఈ లేఖకు సంబంధించి దర్యాప్తు ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని పాఠక్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కాంట్రాక్టర్లు నిజంగా ఈ ఆరోపణ చేశారా అన్నది కూడా తేలవలసి ఉందని పోలీసులు చెబుతున్నారు.