తెలంగాణలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉన్న వ్యాఖ్యలు చేస్తూ.. ఓటర్లను ప్రలోభపెడుతున్నట్టు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని మతసంబంధమైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేతల పట్ల ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టి.. భయానికి గురిచేసి ఎలాగైన ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్న నేతల తీరుపట్ల సీఈసీ ఇప్పటికే అసంతృప్తిని తెలిపినట్టు వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడిన సీఈసీ, ఆయనకు నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో స్టూడెంట్ ట్రైబ్ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు మంత్రి కేటీఆర్ (Minister KTR) టీ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన స్టూడెంట్ ట్రైబ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా సీఈసీకి ఫిర్యాదు చేశారు.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై హామీ ఇస్తూ వ్యాఖ్యలు చేసినట్టు రణదీప్ సింగ్ సుర్జేవాలా సీఈసీకి (Election Commission) ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు..
అదీగాక కేటీఆర్ రాజకీయ కార్యకలాపాల కోసం.. ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను వాడుకున్నారని.. రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Singh Surjewala) ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఈవో, అధికారుల నివేదిక ఆధారంగా.. కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ అంశంపై మధ్యాహ్నం మూడు గంటల్లోగా వివరణ ఇవ్వాలని గడువులోగా వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఈసీ నోటీసులో పేర్కొంది.