– చంద్రబాబు అరకు పర్యటనలో టెన్షన్
– దారి తప్పిన హెలికాప్టర్
– అధికారుల అలర్ట్ అప్రమత్తమైన పైలట్
– అరకులో రా కదలిరా బహిరంగ సభ
– వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
– గిరిజనులను జగన్ మోసం చేశారన్న టీడీపీ బాస్
విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్ లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్ కు కమ్యూనికేషన్ లోపం ఏర్పడిన కారణంగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో హెలికాప్టర్ ప్రయాణించింది. దీంతో పైలట్ రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు ఏటీసీ అధికారులు హెచ్చరించారు. అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను వెనుకకు మళ్లించారు. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం చంద్రబాబు హెలికాప్టర్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ చేరుకొన్నారు.
రా కదలిరా కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు అరకు వెళ్ళిన టీడీపీ అధినేత, అక్కడి నుంచి కారులో సభా ప్రాంగణానికి చేరుకొన్నారు. బహిరంగ సభకు టీడీపీ, జనసేన నాయకులతో పాటుగా.. కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభా వేదికపై ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తనుకు బాగా ఇష్టమైన ప్రాంతం అరకు అని చెప్పుకొచ్చారు. ‘అరకు కాఫీ’ అనే పేరును తానే పెట్టానని అన్నారు.
టీడీపీ కాఫీని పరిచయం చేస్తే.. వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఒక్క మంచిపని అయినా చేశాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బటన్ నొక్కడం తప్ప గిరిజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. నమ్మించి మోసం చేసే వ్యక్తి జగన్ అని అన్నారు. అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. గిరిజనుల కోసం తాము 16 పథకాలు ప్రత్యేకంగా పెట్టామని.. ఐదేళ్ల పాలనలో 16 గిరిజన పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఈ 16 పథకాలను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కూడా రద్దు చేశారన్నారు. గిరిజన పిల్లలు చదువుకోవడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే స్కాలర్ షిప్ లు తీసేశారని ఆరోపించారు చంద్రబాబు. ఈ సభ తర్వాత మండపేటలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలాపురంలో 7 సీట్లను తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని పూర్తి ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు.