నాన్‌వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కొద్ది రోజులుగా చికెన్ ధరల్లో(Chicken Prices) ఏమాత్రం మార్పు రావడం లేదు. అయితే తాజాగా మరోసారి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏపీ(AP)లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది.
పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతుండటమూ మరోకారణంగా తెలుస్తోంది. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ రూ.300, స్కిన్‌తో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు మరింత ఎక్కువ దండుకుంటున్నారు. సామాన్యులకు పెరిగిన చికెన్ ధరలు పెనుభారంగా మారాయి. గత నెలలో కిలో ధర రూ.180పలికింది.
ఇప్పుడు రూ.300లకు చేరడంతో చికెన్ కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అదేవిధంగా కోడి గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5పైనే పలుకుతోంది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు ఇదే అదనుగా ఒక్కో గుడ్డు రూ.8వరకు విక్రయిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సమ్మర్ వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.