ప్రధాని మోడీ (PM Modi)ని కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం (P.Chidambaram) పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం తన విధానాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. ఈ విషయాన్ని ఒప్పు కోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు.
ఏపీజే కోల్కతా లిటరరీ ఫెస్టివల్-2024లో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ. చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. మోడీ ప్రభుత్వంపై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు పలు అంశాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా భయం అనే భావన వ్యాపించి ఉందని వెల్లడించారు.
ఆ భయం ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకమని వెల్లడించారు. గత ఏడాది కాలంలో దేశంలో భయాందోళనలకు లోను కానీ ఏ వ్యక్తిని తాను చూడలేదని చెప్పారు. ఈ 18 నెలల్లో తాను ఎక్కడికి వెళ్లినా… తాను ఎవరితో మాట్లాడినా వారిలో భయం అనే ఆలోచన ఆదిపత్యం చేయడం కనిపించిందన్నారు.
తాను కలిసిన వ్యక్తుల్లో ఏ వ్యాపారవేత్త, న్యాయవాది, డాక్టర్ లేదా చిన్న తరహా పరిశ్రమలతో సంబంధం ఉన్న వారెవరూ తాము ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పవచ్చని, ఏ సినిమా కావాలంటే అది తీయ వచ్చని ఎవరూ చెప్పలేదన్నారు. దేశంలో భయం ఆధిపత్యం, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఆలోచన భయం లేని చోట ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పారు.