చైనా (China) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజాగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన క్రీడాకారుల (Players) కు అక్రిడిటేషన్ ఇచ్చేందుకు చైనా నిరాకరించింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. నివాస ప్రాతిపదికన భారతీయుల పట్ల చైనా భిన్న వైఖరిని అవలంభిస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘిస్తోందని ఫైర్ అయింది.
డ్రాగన్ కంట్రీ చర్యలను నిరసిస్తూ తాను చైనాలో ఆసియా క్రీడల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక చైనా తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారుల పట్ల చైనా ప్రవర్తించిన తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ చర్య ఆసియా క్రీడల నిబంధనలతో పాటు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ అనేది వివాదాస్పద భూభాగం కాదని ఆయన తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ లో విడదీయలేని భాగమని చెప్పారు. తమపై, తమ భూభాగాలపై డ్రాగన్ కంట్రీ చట్ట విరుద్దమైన చర్యలను ఆ రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కలుగజేసుకోవాలని ఆయన కోరారు.
డ్రాగన్ కంట్రీ తీరుపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కొంత మంది క్రీడాకారులను చైనా టార్గెట్ చేసిందన్నారు. కావాలనే వారి పట్ల డ్రాగన్ కంట్రీ వివక్ష పూరితంగా ప్రవర్తిస్తోందని అన్నారు. కావాలనే వారికి వీసాలను నిరాకరించిందన్నారు. చైనా తీరును క్రీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేలా తగిన చర్యలు తీసుకునే హక్కు భారత్ కు ఉందని ఆయన స్పష్టం చేశారు.