లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీకి రిజైన్ చేసి పక్క పార్టీలోకి వెళ్తున్నారో అర్థం కావడం లేదు. నిన్న ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరుసటి రోజే ఇంకో పార్టీ కండువాతో కనిపిస్తున్నారు.దీంతో ప్రజలు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా బిహార్‌లో కీలక నేత అయిన చిరాగ్ పాశ్వాన్‌కు సొంత పార్టీ నేతలు షాకిచ్చారు.
చిరాగ్ పాశ్వాన్(chirag Pashwan) నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(Lok Janshakthi)(దివంగత కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ) ప్రస్తుతం ఎన్డీయే(NDA)లో భాగస్వామిగా ఉంది. తండ్రి మరణాంతరం తనయుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీని లీడ్ చేస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ హిందూస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, ఎల్‌జేపీ కలిసి పోటీ చేయనున్నాయి.
అయితే, ఎంపీ టికెట్ల కేటాయింపులో చిరాగ్ పాశ్వాన్ తమను సంప్రదించకుండా టికెట్లను బయట వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన 22 మంది(22 Key leaders Resign) కీలక నేతలు పార్టీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, వీరిని శాంతింప జేయడానికి చిరాగ్ పాశ్వాన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండగా.. సీఎంగా నితీశ్ కుమార్ కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ఎన్డీయే అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారంలో తలమునకలయ్యారు. ఇదిలాఉండగా, చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్, ఆయనకు అత్యంత సన్నిహితుడు అరుణ్ భారతీ జమయీ స్థానం నుంచి ఎంపీగా బరిలో నిలిచారు.