సొసైటీలో గౌరవప్రదమైన వృత్తులలో ఉంటూ కూడా గౌరవంగా బ్రతకడం కొందరు మరచిపోతోన్నారని కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతోంది. ఇక హాస్పిటల్స్ అంటే రోగులకి దేవాలయంతో సమానం.. అందుకే కావచ్చు వైద్యులని దేవుడితో పోలుస్తారు.. కానీ నేడు దవాఖానాలు అంటే దడ పుట్టించేలా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.. బాధ్యతగా ప్రవర్తించవలసిన డాక్టర్లు భరితెగించి ప్రవర్తిస్తున్నారని కొందరి వాదన.. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగింది..
ఆదిలాబాద్ (Adilabad) రిమ్స్ మెడికల్ కాలేజీ (RIMS Medical College) ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకొన్నట్టు సమాచారం. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఘర్షణ చోటు చేసుకొంది.. ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్ చేస్తోన్న ఇద్దరు విద్యార్థులు గాయపడినట్టు సమాచారం.. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు క్యాంపస్‌లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ హాస్టల్ (College Hostel) వద్ద ధర్నాకు దిగారు. డాక్టర్ క్రాంతి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాగా మెయిన్ గేట్ సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా దుండగులు క్యాంపస్‌లోకి వచ్చారని, వారంతా రిమ్స్ డైరెక్టర్ అభిమానులని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు (police) భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు రిమ్స్‌లోకి చొరబడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం…