ఆంధ్రప్రదేశ్(AP)లో లంచాలు, వివక్షకు ఎక్కడా తావులేదని సీఎం జగన్(CM Jagan) అన్నారు. నంద్యాల జిల్లా(Nandyala District)లోని ఆళ్లగడ్డ(Allagadda) నుంచి ప్రారంభమైన బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరారు. భార్య, పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వ్యవస్థలో సామర్థ్యం పెంచేందుకు సలహాలు ఇవ్వాలన్నారు. ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి బట్టన్ నొక్కి చేయూత నిధులు విడుదల చేశామన్నారు.
58 నెలల పాలనలో ఎంతో అభివృద్ధిని సాధించామని తెలిపారు. అర్హత ఉన్నవారికి పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎర్రగుంట్లలో 93శాతం మంది ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3కోట్ల మందికి పైగా లబ్ధిపొందారని వివరించారు.
అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుకు రూ.13, 500 పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. ప్రతీ మహిళ ముఖంలోనూ ఆత్మ విశ్వాసం కనిపిస్తోందని, ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.
తనకంటే ముందు చాలా మంది అనుభవమున్న నేతలు సీఎంగా పరిపాలించారని జగన్ అన్నారు. 14ఏళ్ల అనుభవమున్న వ్యక్తి చేయలేని అభివృద్ధిని 58నెలల్లోనే చేసిచూపించామని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగిందని, మరింత మార్పు అవసరమని సూచించారు.