ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ (Andrapradesh Assembly)కి కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీన నాలుగో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీ(YCP), ప్రతిపక్ష టీడీపీ(TDP), జనసేన(JANASENA), బీజేపీ(BJP) కూటమి మధ్య డైలాగ్ వార్స్ నడుస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ కసరత్తులు చేస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీ కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఏపీ ఎన్నికలపైనే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో 2014 లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి ఇప్పుడు ఆ పార్టీతో జట్టుకట్టాయి.
ఇక కూటమి వలన అధికార పార్టీకే మేలు జరుగుతుందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే, ఏపీలో ఎలాగైనా రెండోసారి అధికారం చేపట్టాలనే కసితో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ప్రచార భేరీలో సీఎం జగన్ ప్రసంగించారు.
వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని, కూటమి వస్తే ఉన్న పథకాలు పోతాయని చెప్పారు. ఇక రాజకీయాల్లో నాయకుడు అంటే ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉండాలని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో అసలైన నాయకుడు ఎవరో ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. ఎవరి రికార్డు ఏంటో.. ఎవరి రిపోర్టు ఏంటో చూద్దామా? అని జగన్ అన్నారు. ఎవరిది బోగస్, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేలుద్దామా? అని సవాల్ విసిరారు.తమ హయాంలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, సంక్షేమ పథకాలు కావాలనుకునే వారు వైసీపీకి ఓటేయాలని తెలిపారు.