రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ కుట్రలకు తెరలేపుతారని సీఎం వైఎస్ జగన్ (CM Jagan) అన్నారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున విపక్షాలు పొత్తులు పెట్టుకుంటాయని చెప్పారు. కుటుంబాలను చీల్చి రాజకీయాల (Politics)ను చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
కాకినాడ జిల్లా రంగరాయ వైద్య కళాశాల మైదానం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ….. ఎన్నికల వేళ టీడీపీ- జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తాయని అన్నారు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు వాళ్ల మెనిఫెస్టోలో హామీ ఇచ్చారని తెలిపారు.
కానీ ప్రజలకు కనీసం ఒక సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో వాళ్లిద్దరూ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో ఆ దత్తత తండ్రి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే ఈ దత్తత పుత్రుడు కనీసం ప్రశ్నించలేదన్నారు. కానీ ఈ రోజు పేదలకు ఇస్తున్న ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగం ఉందని ఆరోపించారు. అందుకే అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఈ అవినీతిపరులు విమర్శలు గుప్పిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. పెదలకు గత ప్రభుత్వం అరకొరగా పథకాలను అమలు చేసిందన్నారు.
రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారని అన్నారు. మరిన్ని మోసాలు చూడాల్సి వస్తుందని చెప్పారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామంటూ చెప్పుకుంటూ నాయకుల మీ దగ్గరికి వస్తారని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.
అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నానన్నారు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం రాదన్నారు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం కేవలం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం మాత్రమేనన్నారు. పైన ఉన్న ఆ దేవుడిని, కింద ఉన్న ఈ ప్రజలను మీ బిడ్డ నమ్ముకున్నాడన్నారు. అంతే తప్ప మధ్యలో ఉన్న ఈ దళారులను నమ్ముకోలేదని స్పష్టం చేశారు.