– ఒకప్పుడు పాలమూరు బిడ్డ.. హైదరాబాద్ అడ్డా మీద కూలి
-ఇప్పుడు కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేసే రైతు బిడ్డ
-ఇది మారిన ముఖ చిత్రం
-3 ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం వజ్రపు తునకవుతుంది
-తెలంగాణకు శత్రువులు ఇక్కడి దద్దమ్మ రాజకీయ నేతలే
-కృష్ణ ట్రిబ్యునల్ కు లేఖ రాయాలంటే మోడీ సప్పుడు చేస్తలేడు
-బీజేపీ వాళ్లను నిలదీయండి
-తెలంగాణను పోగోట్టింది కాంగ్రెస్
-ప్రాజెక్టులు పెండింగ్ పెట్టింది టీడీపీ
-మళ్లీ ఆగమైతే గోస పడతం
-కొల్లాపూర్ సభలో కేసీఆర్
మహబూబ్ నగర్-రంగారెడ్డి- వికారాబాద్, నల్గొండ జిల్లాల చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్ అడ్డా మీద వలస కూలీగా వుండే వారనీ, ఇప్పుడు బెంగాల్, యూపీ, కర్నూల్ నుంచి కూలీలను రప్పించుకుని వ్యవసాయం చేస్తున్న రైతు బిడ్ద అని తెలిపారు.
ఇది మారిన ముఖ చిత్రం అని చెప్పారు. తెలంగాణ వస్తేనే సకల దరిద్రాలు పోతాయని తాను గతంలో చెప్పానన్నారు. ఆ దరిమిలా చాలా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. పాలమూరు ఎంపీగానే తాను తెలంగాణ సాధించానని గుర్తు చేశారు. మహబూబ్ జిల్లా కీర్తి కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా వుంటుందన్నారు.
కొల్లాపూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో అన్ని లెక్కలు కట్టుకుని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నామన్నారు. అవి కాళేశ్వరం, సీతారామా ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకం అని చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం ఒక వజ్రం తునకలాగా మారుతుందన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందన్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాళేశ్వరాన్ని పూర్తి చేశామన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు చకాచకా సాగుతున్నాయన్నారు. పాలమూరు ప్రాజెక్టు కూడా మూడేండ్ల క్రితమే పూర్తి కావాల్సిందన్నారు. కానీ మహబూబ్ నగర్ లోని గత్తర బిత్తర రాజకీయ నాయకులే దాన్ని అడ్డుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
తెలంగాణకు శత్రువులు ఇక్కడ వుండే దద్దమ్మ రాజకీయ నేతలేనని మండిపడ్డారు. 1975లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే సమయంలో మహబూబ్ నగర్ కు నీళ్ల గురించి ఏ నాయకుడు అడగలేదన్నారు. చివరకు తామే 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్టు బచావత్ ట్రిబ్యునల్ జడ్డీలు వెల్లడించారన్నారు.
సాంకేతిక కారణాలు చూపి వేరే ప్రాంతంలో కట్టకూడదని బచావత్ ట్రిబ్యునల్ చెప్పిందన్నారు. 1981 వరకు జూరాల ప్రాజెక్టుకు ఎవరూ తట్టెడు మన్న కూడా వేయలేదన్నారు. 1981లో తెలంగాణ వ్యక్తి అంజయ్య సీఎం అయ్యాక ప్రాజెక్టుకు పునాది వేశారన్నారు. 2001లో గులాబీ జెండా ఎగురవేసి తాను గర్జించిన తర్వాత ఉద్యమ దెబ్బకు పాలకులు దిగి వచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చారన్నారు.
రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను నాశనం చేశారన్నారు. రాజోలి బండ తూములు మూసేస్తే బాంబులు పెట్టి వాటిని పేల్చి వేస్తామని అప్పటి ఆంధ్రనేతలు అన్నారన్నారు. అప్పుడు రాజోలి బండ వద్దకు అడుగు పెడితే సుంకేశుల ప్రాజెక్టు బద్దలు కొడతనని హెచ్చరించానన్నారు. ఇంటి దొంగలే ప్రాణగండమయ్యారన్నారు. జిల్లాలో పుట్టిన దద్దమ్మలే ప్రాజెక్టును అడ్దుకున్నారన్నారు.
నీళ్లు కిందకు ఉన్నాయి… మనం గడ్డమీద ఉన్నామని నీళ్లు ఎట్లా వస్తాయని గతంలో నేతలు ప్రశ్నించారన్నారు. ఆ నేతలంతా ఇప్పుడు బతికే వున్నారన్నారు. ఈ రోజు పాలమూరు పొంగు చూస్తే కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించేలాగా ఉన్న ఘట్టాన్ని చూసి తాను చాలా సంతోషపడ్డానన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేసి తన జీవతం ధన్యం అయింది.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి పంపకంపై ట్రిబ్యునల్ కు లేఖ రాయాలంటే మోడీ చప్పుడు చేయడం లేదన్నారు. జరిగిన మోసం, జరిగిన నష్టం చాలన్నారు. బీజేపీ నేతలను నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకును ప్రారంభించుకున్నామన్నారు.
తెలంగాణను పోడగొట్టింది కాంగ్రెస్ వాళ్లేనన్నారు. తెలంగాణను దత్తత తీసుకుని పునాది రాళ్లు వేసి ప్రాజెక్టులు పెండింగ్ పెట్టింది టీడీపీవాళ్లన్నారు. ఇప్పుడు రాష్ట్రం తెచ్చుకుని బాగుపడుతున్నామన్నారు. మళ్లీ ఆగమైతే గోసపడతామన్నారు. సంవత్సరానికి 10 వేల మందిని డాక్టర్లుగా తయారు చేసే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు.