సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్.. ఢిల్లీ (Delhi)లో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ (Suman Bheri)తో భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణ (Telangana)కు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.
దీంతో పాటు హైదరాబాద్‌లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. అందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని సుమన్ భేరీకి విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతివ్వాలని కోరారు.
గతనెలలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీతో సచివాలయంలో సమావేశం అయిన సంగతి తెలిసిందే.. దీనికంటే ముందు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత సోనియా గాంధీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కాంగ్రెస్ నేతలు కోరినట్టు సమాచారం. సుమారు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకొన్న నిర్ణయాలు.. పాలన జరుగుతున్న తీరును సీఎం, సోనియాకు వివరించారు.