అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.

తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు మహిళలకు అండగా ఉండేలా అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ (Telangana) రాష్ట్రం తప్పకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని సీఎం ఆకాంక్షించారు.
మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తున్న భక్తులందరికీ ఆ మహాదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.