తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) త్వరలో అరెస్టు అవుతారని ఇటీవల బెయిల్ మీద విడుదల అయిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ (MP Sanjay singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయ్యి గతేడాది నుంచి తిహార్ జైలులో జీవనం గడిపిన సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు రెండ్రోజుల కింద బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీపై(BJP)తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంతో ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపై సందేహం నెలకొన్నదన్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దర్యాప్తు సంస్థలు జైలుకు పంపిస్తాయన్నారు.
త్వరలోనే తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను సైతం అరెస్టు చేసి వారిని తమ ముఖ్యమంత్రుల పదవులకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తాయన్నారు.దేశంలో కేవలం బీజేపీ మాత్రమే ఉండాలని, ఇతర పార్టీలు ఉండకూడదనే చర్య సరికాదన్నారు.
ఢిల్లీ సీఎంపై రెండు తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ పై ఒత్తిడి తెస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ఈ తరహా విధానం ప్రజాతీర్పునకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.త్వరలోనే కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజల కోసం నిరంతరం ఆలోచించే కేజ్రీవాల్‌ను బీజేపీ ఆపలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టంచేశారు.ఆప్ పార్టీ ప్రజా ఉద్యమం నుంచి పుట్టిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.