కర్ణాటక(Karnataka)లో ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని కేసీఆర్, అతడి కొడుకు, బీజేపీ నేతలు తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కర్ణాటక సీఎం(CM) సిద్ధరామయ్య( Sidharamaiah) అన్నారు. అనుమానాలు ఉంటే కర్ణాటక రండి.. పథకాలు ఎలా అమలవుతున్నాయో ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు.
మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని కేసీఆర్, అతడి కొడుకు, బీజేపీ నేతలు తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ తొలి కేబినెట్‌లోనే ఐదు హామీలపై సంతకం చేశామని స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రకటించిన ఐదు హామీల్లో శక్తి యోజనే పథకాన్ని ముందుగా ప్రారంభించామని సిద్ధరామయ్య వెల్లడించారు. రోజూ దాదాపు 61 నుంచి 62 లక్షల మంది మహిళలు రోజు ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. తన భార్య కూడా బస్సులోనే వెళ్తోందన్నారు. తాము ప్రకటించిన ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఐదు గ్యారెంటీలతో పాటు 165 పథకాలను మేనిఫెస్టోలో పెట్టగా 158 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
600 పథకాలను చేస్తామని చెప్పిన బీజేపీ 10శాతం కూడా చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు నడుస్తున్నాయి.. మా కొత్త పథకాలు నడుస్తున్నాయి. కర్ణాటక స్టేట్ ఆర్థికంగా బలంగా ఉంది.. మా రాష్ట్ర బడ్జెట్ చాలా పెద్దదన్నారు. తెలంగాణలో వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.