తన ఇద్దరు చెల్లెల్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) సంచలన ఆరోపణలు చేశారు. ఆయన గురువారం పులివెందుల(Puivendula) లో నామినేషన్ వేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య(YS Viveka Murder) కేసుకు సంబంధించి స్పందించారు.
తన చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆదేవుడికే తెలియాలన్నారు. తన ఇద్దరు చెల్లెళ్లను ఎవరు పంపించి కుట్రలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. చిన్నాన్నను అతిదారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరని ప్రశ్నించారు. నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా అధికార బలంతో ఓడించిన వారితోనే చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు.
చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట, ఆయన రెండో భార్యకు కొడుకు ఉన్నది వాస్తవం కాదా? అని జగన్ అన్నారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన ఆ పార్టీలో చేరిన తన తండ్రి పేరును ఛార్జి షీట్లో పెట్టిన వారికి ఓటు వేయడం ఎవరికి లాభమని నిలదీశారు. ఓట్లు చీల్చి కూటమిని గెలిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి వారు వైఎస్సార్ వారసులా లేక చంద్రబాబు వారసులా ప్రజలే సమాధానం చెప్పాలని కోరారు. అవినాష్ తప్పు చేయలేదనే టికెట్ ఇచ్చానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయన జీవితం నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏ ప్రభుత్వ పథకం మంజూరులోనూ లంచం లేకుండా రూ.2.70కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. కడప, వైఎస్సార్, పులివెందుల ఒక బ్రాండ్ అని అభివర్ణించారు.
వైఎస్సార్ మరణం తర్వాత పదేళ్లు పులివెందులను పట్టించుకున్న వారు లేదన్నారు. ఐదేళ్లలో తానిక్కడ అభివృద్ధి చేసి చూపించానన్నారు. ఇక్కడ కొట్టాలనుకునే వారికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. పులివెందుల ప్రజల చిరకాల కోరిక, నాన్న కలలు గన్న మెడికల్ కాలేజ్ నిర్మించామని చెప్పారు. ఈ గడ్డపై చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలు మరోసారి తిరగరాయాలని జగన్ పిలుపునిచ్చారు.