పారిశ్రామిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి 6 లక్షల ఉద్యోగాలు అందించడమే లక్ష్యమని ఏపీ సీఎం(AP CM) వైఎస్.జగన్ (YS. Jagan) తెలిపారు. పలు పరిశ్రమలను బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. 386 ఎంవోయూలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో చేసుకున్నామని, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నామని తెలిపారు. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభమయ్యాయని, 94 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగామని జగన్ తెలిపారు. 69వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 86 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎప్పుడూ చూడని అడుగులు వేశామని జగన్ తెలిపారు. కొవిడ్ సమయంలోనూ కుప్పకూలిపోకుండా చేయూతనిచ్చామన్నారు.
తాము అనుకున్న తొమ్మి ప్రాజెక్టుల్లో మూడు పనులు ప్రారంభించామని జగన్ తెలిపారు. దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నారు. పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ మేరకు ఇవాళ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు.