తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరి అరెస్ట్ వార్త వినవలసి వస్తుందో అనే టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.. రాజకీయంగా పోరు రంజుగా మారుతుండగా.. మరోవైపు రోజుకో సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి పుట్టను తవ్విన కొద్ది కొత్త కొత్త పేర్లు వెలుగులోకి రావడం కనిపిస్తోంది. తాజాగా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) పీఏ ఒక కేసులో ఇరుక్కోవడం ఆసక్తికరంగా మారింది.
సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల గోల్మాల్ కేసులో నరేష్ సహా మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కాగా హరీష్ రావు వద్ద నరేష్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెదక్ (Medak) జిల్లాకు చెందిన దూమ రవి నాయక్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.. మరోవైపు గతంలో పొలం పనులు చేస్తున్న రవి నాయక్ భార్య పాముకాటుకు గురైంది. అనంతరం చికిత్స తీసుకొంటూ మరణించింది.
అయితే ఆమె ఆస్పత్రి ఖర్చులు సుమారు రూ. 5 లక్షల వరకు అయ్యాయి.. ఈ క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం బాధితుడు దరఖాస్తు చేసుకొన్నాడు. అయితే, నెలలు గడుస్తున్నా.. సీఎం రిలీఫ్ ఫండ్‌పై స్పష్టత రాలేదు. దీంతో అతను సీఎంఓలో సంప్రదించాడు. రవి నాయక్ భార్య పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడో మంజూరు అయిందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. జోగు నరేష్ కుమార్ అనే వ్యక్తి చెక్కులు అందుకున్నట్లు వారు వెల్లడించారు.
కాగా జరిగిన మోసాన్ని గుర్తించిన అతను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. నిందితులపై U/s 417, 419, 420, 120(b) r/w 34 IPC, సెక్షన్ 66(B) & 66(C) IT యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. మరోవైపు ఈ వార్తలను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు.. నరేష్ అనే వ్యక్తి తన పీఏ కాదని తెలిపారు.
అతను తాత్కాలిక ఉద్యోగని.. తన కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే వారన్నారు. ఇక తన పదవి కాలం పూర్తయిన తర్వాత అతను విధుల నుంచి తప్పుకోవడం జరిగిందని తెలిపారు.. అయితే అతను వెళ్లిపోతూ కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు తన వెంట తీసుకువెళ్లినట్లు తెలిసిందన్నారు.. ఈ విషయంపై 17-12-2023 నాడు, నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేసినట్లు తెలిపారు.