బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన నాటి నుంచి కడియం శ్రీహరి మీద గులాబీ నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సమయం చిక్కినప్పుడల్లా విమర్శలతో, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.. కాగా తాజాగా ఆయనపై వస్తున్న ఆరోపణల విషయంలో తీవ్రంగా స్పందించారు.. రైతుబంధు, దళిత బంధు పథకాల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు..
నేడు వరంగల్ (Warangal)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి రాజయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తనపై కక్షకట్టి ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ అండ చూసుకొని పల్లా రూ.వందల కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని కడియం శ్రీహరి ఆరోపించారు.. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ వద్ద రూ.104 కోట్ల మేర కమీషన్ తీసుకొన్నారని మండిపడ్డారు..
కానీ ఆయనలా తాను అధికారాన్ని చూసుకొని వర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు పల్లా తమ్ముడికి మనబడి-మన ప్రణాళిక కాంట్రాక్టులు కూడా ఇప్పించుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా రాజయ్యపై సైతం కడియం విమర్శలు గుప్పించారు.. గతంలో స్టేషన్ ఘన్పూర్ లో దళితబంధు పథకంలో రాజయ్య పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకొన్నారని తెలిపారు.
ఇక భూ కబ్జాలకు పాల్పడటంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి (Pall Rajeshwar Reddy) నెంబర్ వన్ అని ఆరోపించిన కడియం శ్రీహరి (Kadiyam Srihari).. ఆయనపై పలు స్టేషన్లలో నమోదైన కేసుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు.. తన మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు..