ఆధునిక భారత్ నిర్మాణానికి కాంగ్రెస్ (Congress) అందించిన సహకారాన్ని మరుగున పడేలా చేసేందుకు ఎప్పటికప్పుడు మోడీ (Modi) సర్కార్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ఆరోపించారు. ప్రతి విషయంలోనూ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ను లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ తన పదేండ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్వేగపూరిత అంశాలను తెరపైకి తెస్తోందన్నారు.
రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు, ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, భారత్ జోడో న్యాయ్ యాత్ర సన్నాహాలపై చర్చించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ…. కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ విభేదాలను పక్కకు పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ అంతర్గత విషయాల గురించి మీడియా ఎదుట మాట్లాడవద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తే లోక్సభ ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి బీజేపీ అసత్య ప్రచారాలకు తగిన సమాధానం ఇవ్వాలని సూచనలు చేశారు.
భారత్ జోడో యాత్రను చేపట్టినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఖర్గే ప్రశంసించారు. తాజాగా ఆయన చేపట్టబోతున్న భారత న్యాయ యాత్ర పేరును మారుస్తు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రకు భారత్ న్యాయ్ జోడో యాత్రగా పేరు మారుస్తున్నట్టు వెల్లడించింది. మణిపుర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్ర సామాజిక న్యాయ సమస్యలను వెలికితీస్తుందని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, ఇండియా కూటిలోని పార్టీలపై బీజేపీ దాడులు చేస్తోందని చెప్పారు. ఇండియా కూటమిలో బలమైన క్యాడర్, భావజాలం ఉన్న పార్టీలు ఉన్నాయన్నారు. ఎన్డీఏ పేరుకు మాత్రమే మిగిలిందన్నారు. 25 ఏండ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ విశేష సేవలందించారన్నారు. ఆమె అందించిన సేవలను తాను గౌరవిస్తానన్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఎన్డీఏను ఓడించిందని వివరించారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండేలా సోనియా చేశారని గుర్తు చేశారు.