బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha)పై కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 30 లక్షల మందికి సీఎం కేసీఆర్ ఉద్యోగాలను ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవాని రెడ్డి మండిపడ్డారు. 30 లక్షల ఉద్యోగాల వివరాలను కవిత వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మహిళాభివృద్ధి కోసం తాము చర్యలు తీసుకుంంటుంటే తట్టుకోలేక గోప్రో కెమెరాలు పెట్టుకొని, వాళ్ళ కార్మిక సంఘ ఆటోల్లో కేటీఆర్ తిరుగుతూ డ్రామాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేండ్లలో కేసీఆర్ సర్కార్ మహిళలకు ఏమీ చేయాలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు వచ్చిన ప్రతిసారీ ఢిల్లీ వెళ్లి టెంట్ వేస్తదని విమర్శించారు.
ఏఐసీసీ మీడియా ఇంచార్జీ సునీతా పాల్ మాట్లాడుతూ… మొన్నటి దాకా కేసీఆర్ కుటుంబం ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. కేటీఆర్ ప్రజల్లో తిరిగితే ఈ పదేండ్ల పాటు ఏం చేశారని ప్రజలు ఆయన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు మతిస్థిమితం కోల్పోయారని విమర్శలు గుప్పించారు.
బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీపుల్స్ సీఎం అని తెలిపారు. ప్రజల కోసం ఆలోచిస్తున్నారని వెల్లడించారు. కానీ కేటీఆర్ మాత్రం ప్రజలను వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. సర్కార్ ఏర్పడి ఇంకా 50 రోజులు కూడా కాలేదన్నారు. అప్పుడే విమర్శలు చేస్తే ఎలా? అని నిలదీశారు.