Congress : కీలకమైన ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో తమకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు మాజీ ప్రధాని, అస్వస్థుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ను వీల్ చైర్ లోనే తీసుకు వచ్చిన ఉదంతం సంచలనం రేపింది. అలాగే ఝార్ఖండ్ ముక్తి మోర్ఛాకు చెందిన సీనియర్ నేత శిబూ సొరేన్ ఆరోగ్యం బాగా లేనప్పటికీ ఆయనను కూడా పార్టీ సభకు తీసుకువచ్చింది. దీనిపై బీజేపీ (BJP ) మండిపడుతూ ఇది ఎంతో సిగ్గుచేటని, అస్వస్థులైన నేతలను సభకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.
వీల్ చైర్ లో నీరసంగా కూర్చున్న మన్మోహన్ సింగ్ ఫోటోను పార్టీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కేవలం తన సంఖ్యను చూపుకునేందుకు కాంగ్రెస్ ఇలా అస్వస్థులైన వారిని బలవంతంగా సభకు తరలించడానికి చేసిన ‘పిచ్చి’ పనిని ఈ దేశం మరువజాలదని తీవ్రంగా తప్పు పట్టింది. ‘యాద్ రఖేగా దేశ్.. ఏ సన్ కా’ అని వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ ఇంత చేసినా వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు.. ప్రతికూలంగా 102 మంది ఓటు వేశారు.
బీజేడీ, వైసీపీ సభ్యులు ఈ బిల్లును సమర్థించారు. దీంతో బిల్లు విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి తిరుగులేకపోయింది. నిజానికి ఎగువ సభలోఈ బిల్లును వ్యతిరేకించాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. అన్ని విపక్షాలను కోరారు. తనకు మద్దతునివ్వాలని అభ్యర్థించారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి.