పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ(BJP) ఈ జాబితాలో ముందు వరుసలో ఉండగా.. కాంగ్రెస్ (CONGRESS) సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక సర్వేల ప్రకారం మూడో స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ అభ్యర్థల ప్రకటన విషయంలోనూ మూడో స్థానానికే పరిమితమైంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
కాసేపు బీఆర్ఎస్ (BRS) సంగతి పక్కన బెడితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల(Candidates Announcement) ప్రకటన విషయంలో ఎందుకు జాప్యం(LATE) చేస్తున్నది అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నపార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ఎంతో కాలంగా పార్టీలో ఉన్నవారికి పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.
బీజేపీ నుంచి లేదా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి వెంటనే ఎంపీ టికెట్లు ఇస్తోంది. దీంతో ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవ చేస్తున్న సీనియర్ లీడర్లు సీఎం రేవంత్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారు తమ అనుచరులు, బంధువులకు టికెట్లు ఇప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటివరకు కేవలం 9 సెగ్మంట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.
ఇక భువనగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, టికెట్ ప్రకటించి న స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలసనేతలే అధికంగా ఉన్నారు. అందులోనూ రెడ్డి కులస్తులు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన వారు కాకుండా వలస నేతలకు ప్రయారిటీ ఇవ్వడంపై పార్టీలోని సీనియర్లు రేవంత్ పై గుర్రుగా ఉన్నారు. ఇంకా ఎవరైన కొత్త లీడర్లు బీఆర్ఎస్ నుంచి వస్తారా? అని హస్తం పార్టీ ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సొంతపార్టీ నేతలు ఎంపీ టికెట్ కోసం గాంధీ భవన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అలానే ఉంటది.. చివరి నిమిషంలో కూడా అభ్యర్థులు మారిపోతుంటారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.