తెలంగాణలో బీఆర్ఎస్(Brs) ను బంద్ చేసే సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy). గతంలో ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపేది లేదన్న కేసీఆర్ (Kcr).. ఇప్పుడు విలీనం చేస్తున్నారని.. ఓటమి భయం ఎక్కువైందని సెటైర్లు వేశారు. ఇంకో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వస్తుందన్న ఆయన.. పంచాయతీ కార్మికుల జీతం పెంచుతామని స్పష్టం చేశారు.
కేసీఆర్ కు ఆయన కుమారుడు, కూతురు బాగుంటే చాలన్న కోమటిరెడ్డి(Komatireddy).. బంధుల పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలొస్తున్నాయని.. ఆ బంధు ఈ బంధు అంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారని అన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ గానే చూడాలని విమర్శించారు. నల్గొండలో పంచాయతీ సిబ్బంది చేస్తున్న ధర్నాలో పాల్గొన్న ఎంపీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని.. కరోనా సమయంలో ఎంతో పోరాడారని తెలిపారు వెంకట్ రెడ్డి. నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని.. కనీస వేతనం అమలు చేయాలని కోర్టులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమన్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. శనివారం 31వ రోజుకు చేరుకుంది. వేతనాల పెంపు, పర్మినెంట్ సహా పలు డిమాండ్లతో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు సిబ్బంది. ఈ క్రమంలోనే ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు వెంకట్ రెడ్డి.