కర్ణాటక (Karnataka) దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ‘రామ్ లల్లా’ (Ram Lalla ) విగ్రహ ప్రాణ ప్రతిష్ట (consecration ceremony)సందర్భంగా జనవరి 22న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఆదేశించారు.
ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయంలో మహ మంగళ హారతి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని మంత్రి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్ ఖాతా)లో వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో అన్ని ముజ్రాయ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశించినట్టు ట్వీట్ చేశారు.
అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కర్ణాటకలోని దేవాలయాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలనుకుంటున్న కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జనవరి 22న అయోధ్యలో ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు పలువురు ప్రముఖులను శ్రీ రామ క్షేత్ర తీర్థ ట్రస్టు ఆహ్వానించింది. ఇటు కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గెతో పాటు ఇతర నేతలను ఆహ్వానించింది.