తెలంగాణ (Telangana) లోనూ కర్ణాటక తరహా వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది. కర్ణాటక ప్రభుత్వంపై ఉపయోగించిన ‘కమీషన్ సర్కార్’ అస్త్రాన్ని ఇక్కడ కూడా సంధిస్తోంది. తాజాగా ‘కల్వకుంట్ల క్రియేటివ్స్ వారి కమీషన్ కాకతీయ’అంటూ బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అది మిషన్ కాకతీయ కాదు కమీషన్ కాకతీయ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది.
తెలంగాణ సర్కార్ తీసుకు వచ్చిన ఈ మిషన్ కాకతీయ పథకం భారీ కుంభకోణానికి తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఈ పథకం కింద ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణ పేరిట స్థానిక టీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టులు దక్కించుకున్నారని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నాయకుల దోపిడీ ఈ పథకం సహయపడిందని విమర్శలు గుప్పించింది.
ఈ పథకం కింద నాసిరకం పనులు చేపట్టారని, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కాంట్రాక్టర్లకు పంచారని తీవ్రంగా మండిపడింది. ఇక ఇంటింటికి తాను నీరంటూ రూ 42 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరక, మెజారిటీ ఇండ్లకు నీళ్లు అందక పోవడంతో ఈ పథకం పెద్ద కుంభకోణంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక ఇది ఇలా వుంటే ట్విట్టర్ లో ‘బుక్ మై సీఎం’ అంటూ ఫోటోస్ పెట్టింది. కల్వకుంట్ల క్రియేటివ్స్ వారి కమీషన్ కాకతీయ అంటూ టైటిల్ పెట్టింది. ఈ పథకం కింద కాంట్రాక్టర్లు చెరువులు తవ్వితే కేసీఆర్ కమీషన్లు తోడారంటూ ట్యాగ్ లైన్స్ పెట్టింది. ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.