– తెలంగాణ ఆకాంక్షలు
– కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
– తుక్కుగూడ సభా వేదికగా..
– ప్రకటించిన సోనియా గాంధీ
– అన్ని వర్గాల కోసమే కాంగ్రెస్
– అభివృద్ధే అజెండా అని స్పష్టం
– తెలంగాణ ప్రజలపై వరాల జల్లు
– చెప్పింది చేసి చూపిస్తామన్న ఖర్గే
– బీఆర్ఎస్ అవినీతి చేసినా కేసులేవి?
– ఒక్క కుటుంబం కోసమే సోనియా తెలంగాణ ఇవ్వలేదు
– బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న రాహుల్
– కేసీఆర్ ను తరిమేద్దామని రేవంత్ పిలుపు
తెలంగాణ (Telangana) లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలను సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రకటించారు. తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో అనౌన్స్ చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 వేలు ఇవ్వబోతున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.500, రైతులు, కౌలురైతులకు ఏటా రూ.15,000 పెట్టుబడి సాయం, టీఎస్ ఆర్టీసీలో మహిళకు ఉచిత ప్రయాణం, ఇల్లు లేనివారికి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, అర్హులకు నెలకు రూ.4,000 చొప్పున పింఛను ఇస్తామని తెలిపారు.
తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము ఈ హామీలను ప్రకటిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో తాము పాలు పంచుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు సోనియా. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లడం తమ విధిగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్ని వర్గాల కోసం పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలన్నదే తన స్వప్నమన్న సోనియా.. దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం చేసింది కాంగ్రెసే అని, ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చిందన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ గా మారిందన్నారు ఖర్గే.
తాము వేర్వేరు పార్టీలని బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ చెప్పుకుంటాయని.. కానీ, వాస్తవానికి అవి కలిసే ఉన్నాయని విమర్శించారు రాహుల్ గాంధీ. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలను తాను చూశానని, బీజేపీకి అవసరమైనప్పుడు పూర్తి మద్దతిచ్చారన్నారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించడం ఖాయమన్న ఆయన… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందని.. ఒక్క కుటుంబం కోసమే సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ పేరిట పేదల భూములను ప్రభుత్వం లాక్కొందని.. రైతుబంధు పేరిట భూస్వాములకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ.
చివరలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతీ హామీని వెంటనే నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు రేవంత్.