తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వరంగల్ (Warangal)సభని విజయవంతంగా ముగించుకొని పెద్దపల్లిలో (Peddapally) నిర్వహించే సభకు హాజరైయ్యారు. ఇక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ (BRS)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల తెలంగాణను దొరల తెలంగాణగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల సొమ్మును లూటీ చేసిన ముఖ్యమంత్రి కుటుంబం పదవుల్లో ఉండే అర్హత కోల్పోయారని విమర్శించారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు.. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల బ్రతుకులు మారలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని రూ.లక్ష కోట్లు దోచుకున్నారని.. ప్రాజెక్టులతో కేసీఆర్, గుత్తేదారులకే ప్రయోజనం కలిగిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
మోదీ కూడా కేసీఆర్‌లా (KCR) అబద్ధాలు చెప్పి గెలిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని వేశారా అని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోదీ ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. మోదీ (Modi)ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం వేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కంప్యూటరైజ్‌డ్ పేరుతో పేదల భూములను కేసీఆర్ లాక్కున్నారని మండిపడ్డారు.
రైతుబంధు.. భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే తెచ్చారని అన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని రాహుల్ గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని రాహుల్ విమర్శించారు. మరోవైపు రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు జీరాక్స్ సెంటర్లలో విక్రయించారని మండిపడ్డారు.
తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ ఉండేదో తెలుసుకోమని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు వందల ఎకరాలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. ఇచ్చిన రాష్ట్రంలో సామాజిక న్యాయం దక్కాలని పార్టీ భావించిందని.. అందుకే ఆరు గ్యారెంటీలతో పేదలకు న్యాయం చేయాలని నిర్ణయించిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.