రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పది లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy rajgopal reddy) అన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో బీసీలకు రెండు స్థానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకునేందుకు తాము ఉన్నామని వెల్లడించారు. తనకు తెలియకుండానే చలమల కృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోనే ఇప్పుడు రూ.570 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రూ.600 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపణలు గుప్పించారు. దేశంలోనే మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైందిగా మిగిలిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై చలమల ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ తీవ్రంగా మండిపడ్డారు.
డబ్బులతో చలమల రాజకీయం చేద్దామని అనుకున్నారని నిప్పులు చెరిగారు. తన వల్ల పార్టీకి లాభం అవుతుందనే కదా తనను పిలిచారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీలోకి ఆహ్వానిస్తేనే కదా వచ్చానని అన్నారు. కాంగ్రెస్‌లో చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని విమర్శించారు. చలమల కృష్ణారెడ్డి వ్యక్తిత్వం లేని మనిషి అని, ఆయన రాజకీయాలకు పనికి రాడని ఫైర్ అయ్యారు.