భారత్లో కరోనా (CoronaVirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Ministry of Health and Family Welfare) శనివారం ప్రకటించింది. వీటిలో రెండు మరణాలు రికార్డయ్యాయి.
అయితే, కొత్త వేరియంట్ JN.1 సోకిన వారు 600కుపైగా ఉండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో గుజరాత్, తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయి. అధికారిక వర్గాల ప్రకారం డిసెంబర్ 5 నుంచి ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో కొవిడ్-19 కేసులు డిసెంబర్ 31, 2023న 841 నమోదయ్యాయి.
ఇది మే 2021లో నమోదైన అత్యధిక కేసుల్లో 0.2 శాతం. మరోవైపు కరోనా చికిత్స పొందుతున్న మొత్తం 4,187 మందిలో 92 శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు.
దాదాపు 5.3 లక్షల మంది మృతిచెందారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకుపైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉండగా దేశంలో కొవిడ్-19 కట్టడికి ఇప్పటివరకు 220.67 కోట్ల డోసులు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.