హిందువు (Hindu) లను విభజించి దేశాన్ని నడిపించాలని కాంగ్రెస్ (Congress) లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోడీ (PM modi) అన్నారు. చత్తీస్ గఢ్‌లో సహజ వనరులను దోచుకున్న ట్రాక్ రికార్డు కాంగ్రెస్ కు ఉందని ప్రధాని మండిపడ్డారు. వనరుల కేటాయింపులో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ అనే కల సాకారం అవుతుందన్నారు.
ఛత్తీస్ గఢ్ లోని జగ్‌దల్ పూర్‌లో రూ.26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా బస్తర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ….. రాబోయే రోజుల్లో బస్తర్‌లో మరికొన్ని స్టీల్ కంపెనీలను నెలకొల్పుతామని తెలిపారు. ఇక్కడ అభివృద్ధి చేసిన స్టీల్ ఫ్యాక్టరీలతో 55 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్నారు.
రాబోయే రోజుల్లో దేశంలో చాలా మంది ఉద్యోగావకాశాల కోసం బస్తర్ ప్రాంతానికి వస్తారన్నారు. రాష్ట్ర పరిస్థితులను కాంగ్రెస్ ఘోరంగా దిగజార్చిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, నేరాల రేటు బాగా పెరిగిపోయిందన్నారు. ఇక్కడ ప్రభుత్వం తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. కొన్ని సార్లు నేరాల రేటులో చత్తీస్ గఢ్ రాజస్థాన్ తో పోటీ పడుతున్నట్టు కనపిస్తోందన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేవలం పోస్టర్లలో, కాంగ్రెస్ నేతల లాకర్లలో మాత్రమే కనిపిస్తోందన్నారు. అందుకే రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సౌకర్యాలనేవి దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనవని తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.