మహబూబ్నగర్ (Mahabubnagar) పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసుకు సంబంధించిన విచారణ జరిపిన న్యాయస్థానం.. పలు ప్రశ్నలు వేసింది. గత విచారణ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా.. దానికి సంబంధించిన అప్డేట్ వివరాలు అడిగింది. అందరిపై కేసు నమోదు చేశారా? లేదా? అని ప్రశ్నించింది.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. ఒకవేళ నమోదు చేసి ఉంటే ఎఫ్ఐఆర్ సహా పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ), పోలీసులను ఆదేశించింది. మహబూబ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది న్యాయస్థానం.
2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తో పాటు సమర్పించిన అఫిడవిట్ స్థానంలో మరో అఫిడవిట్ అప్ లోడ్ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అఫిడవిట్ ను ట్యాంపర్ చేశారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు మంత్రితో పాటు బాధ్యులైన రిటర్నింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరాడు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాడు.
రాఘవేంద్ర పిటిషన్ ను కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు మంత్రి. కానీ, ఆయనకు అక్కడ చుక్కెదురైంది. రాఘవేంద్ర పిటిషన్ పై ఆయన అభ్యంతరాలను తోసి పుచ్చింది. ఇదే సమయంలో నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. మహబూబ్నగర్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.